స్నానం-వాటిలో రకాలు!!!!

రోజూ చేసే స్నానమేగా- ఇందులో ఏమిటీ విశేషాలు,రకాలు అనుకుంటున్నారా!

మీరు ఎవరెవరు ఎలా స్నానం చేస్తారో అన్న సంగతి పక్కన పెడితే- స్నానం చేయడంలో రకాలు కొద్దిగా తెలుసుకుందాం- చిన్నవైనా, సిల్లీగా ఉన్నా కొత్త విషయాలు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దశాబ్దాలుగా మన సినిమావాళ్లు హీరో, హీరోయిన్, విలన్, పాటలు, ఫైట్లు - వీటినీ అటూ ఇటూగా ఎవరి పంధాలో వాళ్ళు చూపించడంలా మనం పుట్టకముందునుంచి- చెప్పే విధానం- అదే కధనం తేడా అంతే-స్నానాల గొడవా అంతే మరి.

స్నానం రెండు పొద్దులా చేసేవాళ్ళు!
ఒక పూటే చేసే వాళ్ళు!
ఒక పూట కూడా చేయనివాళ్ళు!
రెండు మూడు రోజులకొకసారి చేసేవాళ్ళు!
వారానికొక సారి చేసేవాళ్ళు-జుమ్మా సే జుమ్మా లాగా అన్నమాట!

వివరాల్లోకి వెళ్దాం...

కాకి స్నానం!

చెంచాడు నీళ్లు చాలు వీళ్ళకి- బహు పొదుపరులు, కోటా శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్ లాగా!

నదీస్నానం-సముద్రస్నానం!

పుణ్యం వస్తుందని చేసేవాళ్ళే ఎక్కువ- చేసిన పాపమ్ పోయి పుణ్యం పుచ్చిపోయేట్టుగా వస్తుందని ఆశించేవాళ్లూ ఉన్నారనుకోండి!

బావి స్నానం!

బావిలో నీళ్లు ఇంకేంత వరకూ చేయగలరు వీళ్ళు,పక్కనున్న వాళ్ళు అడ్డుచెప్పక పొతే-బావులే మాయం అయిపోయిన రోజులు ఇవి-బావి అంటే ఏమిటి అని మాత్రం అడక్కండి.

చిన్నప్పుడు ఇంట్లోకి కావాల్సిన నీళ్లు తోడి బావి దగ్గరే స్నానం చేసినవాళ్ళం- వేసవిలో బావి స్నానం మజాయే వేరు-ఒళ్ళు పగిలిపోయే మిట్టమధ్యాహ్నం ఎండ భరించిన తర్వాత- చెమట పొక్కులు వస్తాయని ఇంట్లోవాళ్ళు వారించినా-వేడి తాపానికి భరించలేక వాళ్ళ మాటలు లక్ష్యపెట్టేవాళ్ళమే కాదు!

సరిగంగ స్నానం!

సాధారణంగా కొత్త దంపతులకు పరిమితమైంది ఇది- ఈ రోజుల్లో ఈ తరం ప్రేమ పక్షులు కూడా ఇలా తడుస్తున్నారని అక్కడా ఇక్కడా వినికిడి అయితే ఉంది-నిజానిజాలు ఎంత వరకో తెలియకపోయినా!

ఏనుగు స్నానం!

ఎన్ని నీళ్ళైనా చాలవు వీళ్ళకి-ఇలాంటి ఉన్న ఇళ్లల్లో,ముందుగా ఇంట్లోవాళ్ళు అందరూ స్నానాలు చేసి గానీ, వీళ్ళని స్నానానికి వదలరు. పొరపాటున వీళ్ళు ముందు వెళ్ళారా- అంతే సంగతులు -ఇంటిల్లిపాదికి స్నానానికి నీళ్లు ఉండవు- అందరూ ఒంటిమీద సెంటు వేసుకోవాల్సిందే ఆ రోజుకి- మన ఇంట్లోవాళ్ళే కదా అని సెంటు వేసుకోకుండా ఉండలేంగా మరి!

నాకు అర్ధం కాదు శరీరంలో ఉండే అవయవాలు అందరికి ఒకటే,కొందరికి ప్రత్యేకంగా ఎక్కువేమీ ఇవ్వలేదుగా భగవంతుడు -కొద్దిగా పరిణామాలు తేడా,దానికి అన్ని నీళ్లు ఎందుకో!

అదీ నిజమే- ఎన్ని నీళ్లు ఉన్నా,చాలని వాళ్ళు ఉంటే, కొన్ని నీళ్లున్నాసర్దుకునే వాళ్ళూ ఉంటారు.శరీరం పరిమాణాన్ని బట్టి స్నానం చేయంగా- ఏదో అలవాటుగా చేసేస్తాం- అంతే.స్నానం తర్వాత శరీరం శుభ్రంగా ఉండాలి అంతేగా- పక్కవాడు వాసన అని చెప్పలేక మన పక్కనించి వెళ్ళగానే ముక్కు మూసుకునేట్టు ఉండకూడదు.లేదంటే “స్నానం చేయలేదా అనో,స్నానం చేసి రాకపోయావో” అని అనకూడదు- అంతవరకే గానీ స్నానం అనేది ఓ యజ్ఞంలా చెయ్యక్కరలేదని నా అభిప్రాయం!

కాదూ కూడదు అనేవాళ్ళు అలాగే కానివ్వండి- మీ ఇల్లు, మీ ఒళ్ళు, మీ నీళ్లు- మధ్యలో నేనెవర్ని కల్పించుకోవడానికి!

గోడమీద నాలుగు మగ్గుల స్నానం!

ఏదో గోడకు చేయించే స్నానం అనుకోకండి! వీళ్ళు స్నానం చేసాం అని బయటవాళ్ళకి భ్రమ కల్పించడానికి బాత్ రూమ్ లోకి వెళ్లి వస్తారు-రెండు మగ్గులు ఒంటిమీద మిగిలిన రెండు మగ్గులు గోడమీద పోస్తారు-తర్వాత వెళ్లినవాళ్ళు అనుమానించకుండా-ఈ తెలివితేటలకేం కొదవలేదు.నాలుగు మగ్గులేమిటి, రెండు మగ్గులతో అయినా స్నానం పూర్తి చేస్తారు-మహానుభావులు.

చప్పుడు స్నానం!

వీళ్ళు చేసే చప్పుడుకి ఇంట్లోవాళ్ళకే కాకుండా ఇరుగుపొరుగుకు కూడా తెలుస్తుంది వీళ్ళు స్నానం చేస్తున్నారని.వీళ్ళని అడిగిచూసాగానీ వీళ్ళ ఈవైఖరికి కారణం మాత్రం తెలియలేదు నాకు-బహుశా వాళ్ళకీ తెలియదనుకుంటాను.

కుళాయి స్నానం!

మున్సిపాలిటీ వాళ్ళు కుళాయిలు కట్టేంతవరకూ చెయ్యగలరు మధ్యలో మంచినీళ్ల బిందెల వాళ్లకి కాస్త చోటిచ్చి.ఇప్పటికీ నగరాల్లో ఉన్న చిన్నచిన్న బస్తీల్లో ఈ దృశ్యాలు కనపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు.

వీళ్ళకి మాత్రం చక్కటి నియమం ఉంది- మిగిలిన రకాలుగా స్నానం చేసేవాళ్లలాగా కాదు- కుళాయిలో నీళ్లు వస్తేనే స్నానం- లేదంటే లేదు.వీళ్ళ ఉద్దేశం ప్రకారం- కుళాయి తప్పు గానీ వీళ్లది కాదు- వీళ్ళు స్నానం చెయ్యకపోవడం అనేది.

గుండిగతో, గంగాళంతో స్నానం!

ఈ రకమైన స్నానం మనకు పల్లెల్లో తప్ప కనపడదు- గుండిగ,గంగాళం అంటే మాత్రం నే వర్ణించలేను.పల్లెటూరు నేపధ్యం ఉన్నవాళ్ళుగానీ, పల్లెటూరు చూసిన వాళ్లకి గానీ ఈ రకం స్నానాలు తెలుస్తాయి.

సామూహిక స్నానాలు!

సామూహిక వివాహాలు విని ఉంటారు,ఇది బహుశా చాలామంది విని ఉండరు; సామూహికంగా అన్నాకదా అని-శ్రీకృషుడి లెవెల్లో చెట్టెక్కి మీరు ఏవేవో ఊహించుకోనక్కర్లేదు - ఇవి పక్కాగా చిన్నపిల్లలకి మాత్రమే పరిమితమయిన ప్రక్రియ.కాకపోతే పెద్దా చిన్నా,ముసలి ముతకా అందరూ పుష్కరాల సమయంలో, కార్తీకమాసంలో ఈ సామూహిక స్నానాలు చేస్తారు.

కాకపోతే పూర్వం పెద్ద బావుల్లోనూ,చెరువుల్లోనూ, కొలనుల్లోనూ, ఇప్పటికీ గోదావరి ఒడ్డున కాల్వల్లోనూ కనపడతాయి"తూగోజీ- పాగోజీ"వాళ్లకి బాగా పరిచయం- అక్కడ పుట్టి పెరిగిన వాళ్లయితే ఇలాంటి స్నానాలు వాళ్ళకి సుపరిచితమే.నా లెక్క ప్రకారం వీళ్ళు ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు- మనసు పీకుతూ ఉండొచ్చు, కొందరైతే పాతస్నేహితులతో ఇలాంటి స్నానాలు చేస్తున్నా ఆశ్చర్యం లేదు.

ఇంకా ఒకటో రెండో రకాలు ఉండి ఉంటాయి, ఏదో నాకు గుర్తున్నంతవరకు రాసాను- ఏట్లో, గోదాట్లో కాకుండా!

ఇప్పుడు చెప్పండర్రా- గుండెమీద చేయి వేసుకొని- వద్దులేండి మీవంటిమీద ఒట్టు వేసి చెప్పండి-ఇన్నిరకాల స్నానాలు మీకు తెలుసనీ- బహుకొద్దిమందికి తప్ప!

కాకపొతే ఈ తరం వాళ్ళు మాత్రం “త్రివిక్రమ్, కృష్ణ వంశీ, శ్రీకాంత్ అడ్డాల” సినిమాల్లో కొన్ని రకాలు చూసి ఉంటారు.కావాలనే కె.రాఘవేంద్రరావు సినిమాల స్నానాలు రాయలేదు- అయన దేనితో అయినా స్నానం చేయిస్తాడు- అవన్నీ మనందరం చూసినవే- ప్రత్యేకంగా రాయనక్కరలేదు!

ఇది మాత్రం నేను శుచిగా స్నానం చేసే రాసాను!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!